
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ లాంటి జట్లను చూసి రిజ్వాన్ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఒక్క విజయం లేకుండానే
ఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.
గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం
ఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.
కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.
పాక్ క్రికెట్ ‘ఐసీయూ’లో ఉంది
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్ ఖాన్ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.
గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.
టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్ క్రికెట్ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు.
చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment