
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో చెత్త ప్రదర్శన కారణంగా రిజ్వాన్ బృందంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
కనీసం ఒక్క విజయం కూడా లేకుండానే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పటికైనా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని.. ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రం(Wasim Akram) కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
5-6 మార్పులు చేయాల్సి వచ్చినా
టెన్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘జరిగిందేదో జరిగింది. ఇదే జట్టుతో గత రెండేళ్లుగా మనం ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు కోల్పోయాం. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వకార్ యూనిస్ అంటున్నాడు. ఒకవేళ మన జట్టులో 5-6 మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వెనుకాడకండి.
ఇదే జట్టును మాత్రం కొనసాగిస్తే వచ్చే ఆరునెలల్లో మనం మరిన్ని చేదు అనుభవాలు చూస్తాం. టీ20 ప్రపంచకప్-2026కు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయండి’’అని వసీం అక్రం పీసీబీకి సూచించాడు. అయితే, ఈ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభ్యంతరం వ్యక్తం చేశాడు.
‘‘వసీం భాయ్ మాటలు నేను విన్నాను. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత మనమంతా భావోద్వేగంలో మునిగిపోయిన మాట వాస్తవం. అయినా.. జట్టు నుంచి 6-7 మంది ఆటగాళ్లను తప్పించాలని వసీం భాయ్ అంటున్నాడు.
నిజంగా అంత సీనుందా?
ఒకవేళ అదే జరిగితే.. మనకు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదారుగురు ప్లేయర్లు ఉన్నారా?.. మన బెంచ్ బలమెంతో మీకు తెలియదా వసీం భాయ్! మన దేశవాళీ క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లు ఎంతమంది?.. ఒకవేళ మీరన్నట్లు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే వారిలో ఎంత మందికి సరైన రీప్లేస్‌మెంట్ దొరుకుతుంది? మీరేమో ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని చెబుతున్నారు.
కానీ ఒకవేళ మనం ఆ పని మొదలుపెట్టినా.. అప్పుడు కూడా మన మీద ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మళ్లీ విమర్శలు వస్తూనే ఉంటాయి’’ అని షాహిద్ ఆఫ్రిది సామా టీవీ షోలో వసీం అక్రం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. రెండో మ్యాచ్‌లో దాయాది భారత్ చేతిలో పరాజయం పాలైంది. అనంతరం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క గెలుపు కూడా లేకుండానే ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణం ముగించింది. ఇక ఈ ఈవెంట్లో భారత్, న్యూజిలాండ్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి.
చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
Comments
Please login to add a commentAdd a comment