
భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇరుదేశాల సంబంధాల దృష్ట్యా ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ వంటి అగ్రశ్రేణి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.
అందుకే దాయాదుల మధ్య పోరును వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 23న తెరపడనుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓవర్‌హైప్...
‘‘ఇండియా- పాకిస్తాన్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కు ఓవర్‌హైప్ ఇస్తున్నారు. దీనికి ఇంతగా ప్రచారం అవసరం లేదు. ఓసారి పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్ల గణాంకాలు పరిశీలించండి. బాబర్ ఆజం వాళ్ల స్టార్ బ్యాటర్. మరి టీమిండియాపై అతడి బ్యాటింగ్ సగటు కేవలం 31.
టాప్ బ్యాటర్ అన్నప్పుడు కనీసం అతడి యావరేజ్ 50కి దగ్గరలో ఉంటే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ సమయంలో ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. ఆటగాడిగా అతడంటే నాకు ఇష్టమే. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తాడు. కానీ భారత జట్టుపై అతడి బ్యాటింగ్ సగటు 25 మాత్రమే.

టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే!
అయితే, ఫఖర్ జమాన్ సంగతి వేరు. అతడు పాక్ జట్టు పూర్తిస్థాయి ఓపెనర్. టీమిండియా మీద బ్యాటింగ్ యావరేజ్ 46. కాబట్టి టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగల సమర్థత అతడొక్కడికి మాత్రమే ఉంది. ఇక ఫాహీం ఆష్రఫ్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
కనీస పోటీ కూడా ఇవ్వదు
అతడి సగటు.. 12.5. కాబట్టి అతడి గురించి టీమిండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సౌద్ షకీల్ టీమిండియాపై సగటున 8 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఆ జట్టు భారత్‌కు కనీస పోటీ కూడా ఇస్తుందని అనిపించడం లేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ ఆజం పాకిస్తాన్ తరఫున టాప్ వన్డే ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే, టీమిండియాపై మాత్రం బాబర్ ఆజం రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి వరకు భారత్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి సగటున 31.14తో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాలతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌ను కివీస్‌కు సమర్పించుకుంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్‌దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.
చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్!
Comments
Please login to add a commentAdd a comment