
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్‌లో తనను మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే కింగ్ కోహ్లి(Virat Kohli) సమాధనమిచ్చాడు.
దాయాదిపై విరాట్ ఆజేయ శతకం సాధించాడు. ఈ ఢిల్లీ క్రికెటర్ లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అతడి ఇన్నింగ్స్‌కు, పట్టుదలకు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ సైతం ఫిదా పోయాడు. ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్‌లో 82వది కావడం. సచిన్ 100 సెంచరీలకు కోహ్లి 18 శతకాల దూరంలో ఉన్నాడు.
కోహ్లి ప్రదర్శనపై అన్ని వైపులనుంచి ప్రశంసలు వస్తున్నాయి. "అతని ఆటను చూస్తే కనీసం మరో 2–3 ఏళ్లు ఆడి మరిన్ని శతకాలు సాధించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లిలాంటి ఆటగాడు తరానికొక్కడు మాత్రమే ఉంటాడు. అతని పట్టుదల, పోరాటతత్వం ఈ మ్యాచ్‌లో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో బాగా ఆడినప్పుడు ఒకరి సత్తా ఏమిటో తెలుస్తుంది.
కోహ్లి కనీసం మరో 2–3 ఏళ్లు ఆడటం మాత్రమే కాదు, మరో 10–15 సెంచరీలు సాధిస్తాడని బల్లగుద్ది చెప్పగలను. గత ఆరు నెలల్లో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ పాకిస్తాన్‌పై పరుగులు సాధించడం మరో పదేళ్ల పాటు దీనిని ఎవరూ మరచిపోలేరు’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.
కుర్రాళ్లు కోహ్లి లాంటి ఆటగాళ్ల నుంచే స్ఫూర్తి పొందుతారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళతారని సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లి సామర్థ్యం ఏమిటో ఈ మ్యాచ్‌లో కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో అతని ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు చూస్తే పాత విరాట్ గుర్తుకొచ్చాడు. ఇన్నింగ్స్ సాగిన కొద్దీ అతనిలోని పోరాట తత్వానిŠన్ నేను చూశాను. ఒక ఆట ఎదగాలంటే ఇలాంటివారే స్ఫూర్తిగా నిలుస్తారు.
అతను కోహినూర్‌లాంటి వాడు. ఛేదనలో కోహ్లి రికార్డు చూస్తే ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఆడతాడని అర్థమవుతుంది. కోహ్లి సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ కూడా ఎంతో ఆనందంగా కనిపించాడు. సహచరుడి పట్ల గర్వంగా ఉండటం టీమ్ గేమ్‌లో ఉండే గొప్పతనం ఏమిటో చూపించింది’ అని సిద్ధూ పేర్కొన్నాడు.