
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆజేయ శతకంతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
అయితే కోహ్లి తన 51 వ వన్డే సెంచరీని అందుకునే క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. మైదానంలోనూ, టీవీల ముందు అభిమానులు కూడా కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అనేదాని గురించే ఆసక్తిగా ఎదురు చూశారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే క్రీజ్‌లో మరోవైపు ఉన్న అక్షర్ పటేల్ పరిస్థితి ఎలా ఉంది! భారత్ విజయానికి 19 పరుగులు, కోహ్లి సెంచరీకి 14 పరుగులు కావాల్సిన స్థితిలో అక్షర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఒక్క పెద్ద షాట్ ఆడి బౌండరీ సాధించినా లెక్క మారిపోయేది. అందుకే అతను పరుగులు తీయరాదనే అందరూ కోరుకున్నారు.
తాను కూడా ఇలాగే భావించినట్లు, కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నట్లు అక్షర్ వెల్లడించాడు. ‘మ్యాచ్ చివరికి వచ్చేసరికి నేను కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాను. బంతి నా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కూడా వెళ్లరాదని కోరుకున్నాను. ఆ సమయంలో అంతా సరదాగా అనిపించింది.
ఇంత తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో విరాట్ సెంచరీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ ఇన్నింగ్స్‌ను చాలా ఆస్వాదించాను. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత వికెట్ల మధ్య అతను పరుగెత్తిన తీరు విరాట్ ఫిట్‌నెస్‌కు తార్కాణం’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment