
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు.
మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్‌పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.
దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.
ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్‌పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్‌పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.
అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్‌తో పాటు సౌద్ షకీల్‌ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.
ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్‌లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.
ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.
డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్‌లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment