కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్‌ శర్మ! | ICC ODI Rankings: Rohit Falls Virat Kohli Rises After Australia Semis Clash | Sakshi
Sakshi News home page

కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్‌ శర్మ ర్యాంకు

Published Wed, Mar 5 2025 4:46 PM | Last Updated on Wed, Mar 5 2025 5:23 PM

ICC ODI Rankings: Rohit Falls Virat Kohli Rises After Australia Semis Clash

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి గ్రూప్‌-‘ఎ’ టాపర్‌గా సెమీ ఫైనల్‌కు చేరింది భారత్‌. దుబాయ్‌లో మంగళవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

నిరాశపరిచిన రోహిత్‌
ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌(45), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(42 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

నాలుగో స్థానానికి
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆసీస్‌తో మ్యాచ్‌లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్‌ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.

ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ అక్షర్‌ పటేల్‌ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్‌ స్టార్‌ మ్యాట్‌ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.

ఐసీసీ మెన్స్‌​ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. శుబ్‌మన్‌ గిల్‌(ఇండియా)- 791 రేటింగ్‌ పాయింట్లు
2. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 770 రేటింగ్‌ పాయింట్లు
3. హెన్రిచ్‌ క్లాసెన్‌(సౌతాఫ్రికా)- 760 రేటింగ్‌ పాయింట్లు
4. విరాట్‌ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్‌ పాయింట్లు
5. రోహిత్‌ శర్మ(ఇండియా)- 745 రేటింగ్‌ పాయింట్లు.

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement