మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్‌ శర్మ కౌంటర్‌ | Rohit Sharma Hit Back At Criticism On Champions Trophy Squad, Says We Have Only 2 Spinners Others Teams Have 6 Pacers | Sakshi
Sakshi News home page

మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్‌ శర్మ కౌంటర్‌

Published Thu, Feb 20 2025 8:04 AM | Last Updated on Thu, Feb 20 2025 9:49 AM

We Have Only 2 Spinners Others Teams Have: Rohit Sharma Refutes Criticism

మెగా క్రికెట్‌ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా గురువారం చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్‌ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్‌(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్‌ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.

మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. 

మరో ముగ్గురు బ్యాటింగ్‌ చేయగల ఆల్‌రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. 

జడేజా, అక్షర్‌, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.

టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని  అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్‌మ్యాన్‌.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.

కొత్తగా వరుణ్‌ చక్రవర్తి
కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్‌ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాత్రమే ఉన్నాడు. 

అయితే, ఫైనల్‌ టీమ్‌ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.

ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌, మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ పైవిధంగా స్పందించాడు.

ఇదిలా ఉంటే.. గ్రూప్‌-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్‌ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ జట్టు న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి.

చదవండి: CT 2025: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం.. లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement