![5 Spinners In Dubai: Ashwin Questions India Strategy For CT 2025 Squad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/indvseng.jpg.webp?itok=i2RJgNWX)
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.
యశస్వి జైస్వాల్‌ను తప్పించి
కాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నాకు అర్థం కావడం లేదు
‘‘దుబాయ్‌కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.
కానీ దుబాయ్‌కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.
అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్‌ను తప్పించి మూడో సీమర్‌ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్‌కు ఎలా చోటిస్తారు?
ఒకవేళ కుల్దీప్‌తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
3-0తో క్లీన్‌స్వీప్
కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది.
ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment