![CT 2025 We Can Defeat Any Team: Bangladesh Captain Big Statement](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Bangladesh.jpg.webp?itok=poLz1Txo)
నజ్ముల్ షాంటో (PC: ICC X)
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Nazmul Hossain Shanto) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. తమకు గతంలో నాణ్యమైన పేసర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరని.. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు.
తొలుత టీమిండియాతో
ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్లు, బ్యాటర్లు జట్టులో పుష్కలంగా ఉన్నారని షాంటో సహచర ఆటగాళ్లను కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో రంగంలోకి దిగనుంది.
అనంతరం ఫిబ్రవరి 24న రావల్పిండిలో న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో ఐసీసీతో మాట్లాడిన కెప్టెన్ నజ్ముల్ షాంటో తమ జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే
‘‘చాంపియన్స్‌గా నిలిచేందుకే మేము టోర్నీ ఆడేందుకు వెళ్తున్నాం. ఇందులో పాల్గొంటున్న ఎనిమిది జట్లు కూడ ఇందుకు అర్హత కలిగినవే. ప్రతి జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మా జట్టు సామర్థ్యాల పట్ల నాకు నమ్మకం ఉంది.
ఎవరూ ఒత్తిడిగా ఫీలవ్వడం లేదు. ముందుగా చెప్పినట్లు ఈ ఈవెంట్లో ఆడే ప్రతి జట్టు విజేతగా నిలవాలని భావించడం సహజం. అయితే, మా తలరాతలో ఏముందో తెలియదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాం.
లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. జట్టులోని పదిహేను మంది సభ్యుల పట్ల నాకు విశ్వాసం ఉంది. మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల సత్తా వారిలో ఉంది. గత కొంతకాలంగా మా జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరనే లోటు ఉండేది.
అయితే, ఇప్పుడు మా పేస్ దళం పటిష్టంగా ఉంది. మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు. మాదొక సమతూకమైన జట్టు. జట్టులోని ప్రతి సభ్యుడు తమ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారనే నమ్మకం ఉంది. మాదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా మేము ఓడించగలం’’ అని నజ్ముల్ షాంటో విశ్వాసం వ్యక్తం చేశాడు.
నాడు సెమీస్‌లో
కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా.. బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ చేరింది. అయితే, సెమీస్‌లో టీమిండియా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడి నిష్క్రమించింది. ఇక వన్డే ఫార్మాట్ టోర్నీలో నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.
చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment