![Ind vs Eng: Rohit Sharma Comments After Win, Bluntly Defends His Dismissal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/rohit.jpg.webp?itok=GCfZ0TIT)
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో తాను అవుటైన తీరు పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. బౌలర్ అద్భుతమైన బంతిని సంధించాడని.. అది ఆడటం ఎవరితరం కాదంటూ తనను తాను సమర్థించుకున్నాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత నాగ్‌పూర్‌లో బట్లర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. విధ్వంసకర శతకం(119) బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మార్క్‌వుడ్ సూపర్ డెలివరీ
అయితే, అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం హిట్‌మ్యాన్ తేలిపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్(Mark Wood) గంటకు దాదాపు 142 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని ఆడటం తప్ప రోహిత్ శర్మకు మరో ఆప్షన్ లేకపోయింది.
ఈ క్రమంలో అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ తన కుడివైపునకు డైవ్ చేసి మరీ ఒడిసిపట్టాడు. దీంతో రోహిత్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.
టాస్ ఓడిన టీమిండియా.. ఇలా ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 34.2 ఓవర్లలో 214 పరుగులు చేసి బట్లర్ బృందం ఆలౌట్ అయింది. ఫలితంగా 142 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్‌ను సంపూర్ణ విజయంతో ముగించింది.
క్రెడిట్ మొత్తం బౌలర్‌కే ఇవ్వాలి
ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్ సాగిన తీరుపట్ల ఎంతో సంతోషంగా ఉంది. సవాళ్లు ఉంటాయని ముందే తెలుసు. ఊహించనవి కూడా జరగడం సహజమే. నా విషయంలో క్రెడిట్ మొత్తం బౌలర్‌కే ఇవ్వాలి. బౌలర్‌గా నన్ను సవాల్ చేయడం అతడి కర్తవ్యం. బ్యాటర్‌గా బౌలర్‌ను ఎదుర్కోవడం నా పని.
ఇక్కడ ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడే క్రమంలో నేను ఆ బంతిని ఆడటంలో విఫలమయ్యాను. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సిరీస్‌లో మా జట్టు ఆడిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మా ఆట తీరును మెరుగుపరచుకోవాల్సి ఉంది.
చాంపియన్ టీమ్
వాటి గురించి నేను ఇక్కడ వివరణ ఇస్తూ ఉండలేను. అయితే, జట్టుగా నిలకడైన ప్రదర్శన చేయడం పట్ల మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. చాంపియన్ టీమ్ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని ఆశించడం సహజమే కదా! మేమూ అంతే.. తమకు నచ్చిన విధంగా ఆడేలా మా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం.
అందుకు వరల్డ్‌కప్(2023) చక్కటి ఉదాహరణ. అయితే, నాడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. ఆటలో ఇవన్నీ భాగమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పరిపూర్ణ విజయం సాధించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది.
తదుపరి ఐసీసీ టోర్నీలో
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో.. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక 2017లో చివరగా నిర్వహించిన ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో ఫైనల్ చేరిన టీమిండియా పాక్ జట్టు చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
వారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు
Captain @ImRo45 is presented the winners trophy by ICC Chairman, Mr @JayShah as #TeamIndia clean sweep the ODI series 3-0 👏👏
#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/1XaKksydw9— BCCI (@BCCI) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment