టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు.
అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.
దారుణ వైఫల్యాలు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్‌మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే, నాగ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.
నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో
ఇక ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నా.
అదే విధంగా కోచ్ గౌతం గంభీర్‌కు కూడా గుడ్‌లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.
సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవు
అయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్‌లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!
పొగిడినవాళ్లు.. తిడతారు కూడా
నేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment