సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్ సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్‌పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.
— crictalk (@crictalk7) March 4, 2026
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్) కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (34) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు.
వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్ 18, డికాక్ 10, మిల్ర్ 6, బాష్ 2, రికెల్టన్, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను రచిన్ (4-0-29-2), మ్యాట్ హెన్రీ (4-0-34-2), కోల్ మెక్‌కోంచి (1-0-9-2), ఫెర్గూసన్ (4-0-29-1), మిచెల్ సాంట్నర్ (4-0-25-0) దెబ్బకొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్డ్ (58), ఫిన్ అల్లెన్ (100 నాటౌట్) 9 ఓవర్లలో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అతనికి రచిన్ (13 నాటౌట్) సహకరించాడు.
2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది.


