![Gavaskar Blasts KL Rahul After Poor Knock It Was Half Hearted Shot Vs Eng](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/kl2.jpg.webp?itok=qz_FhhDd)
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది.
248 పరుగులు
ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.
అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
అయ్యర్ మెరుపు అర్ధ శతకం
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.
ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్‌మన్ గిల్‌కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.
కానీ తన బ్యాటింగ్ పార్ట్‌నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు.
స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
Comments
Please login to add a commentAdd a comment