తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్‌ కాల్‌ తర్వాత..: శ్రేయస్‌ అయ్యర్‌ | Wasnt In India Original XI For 1st ODI Then Rohit Sharma Called: Shreyas Iyer | Sakshi
Sakshi News home page

తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్‌ కాల్‌ తర్వాత..: శ్రేయస్‌ అయ్యర్‌

Published Fri, Feb 7 2025 11:03 AM | Last Updated on Fri, Feb 7 2025 11:48 AM

Wasnt In India Original XI For 1st ODI Then Rohit Sharma Called: Shreyas Iyer

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన ఈ ముంబైకర్‌.. ఇంగ్లండ్‌(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్‌ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.

అయ్యర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్‌ విషయాన్ని వెల్లడించాడు. నాగ్‌పూర్‌ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్‌ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్‌ నుంచి కాల్‌ వచ్చింది. విరాట్‌ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్‌ చెప్పాడు.

తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు
వెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.

దురదృష్టవశాత్తూ విరాట్‌ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్‌ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

అదే నాకు ఉపయోగపడింది
ఇక దేశవాళీ క్రికెట్‌ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్‌ సీజన్‌ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్‌ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.

ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్‌లో అయ్యర్‌ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా ముంబైకి టైటిల్‌ అందించాడు.

నాలుగు వికెట్ల తేడాతో రోహిత్‌ సేన విజయం
ఇక భారత్‌- ఇంగ్లండ్‌ వన్డే విషయానికొస్తే.. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బట్లర్‌ బృందం తొలుత బ్యాటింగ్‌ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్‌డౌన్‌ బ్యాటర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(36 బంతుల్లో 59), ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(47 బంతుల్లో 52) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్‌ టార్గెట్‌ను పూర్తి చేసింది.

చదవండి: IND vs ENG: శ్రేయస్‌ అయ్యర్‌ వరల్డ్‌​ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement