టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం
టాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.
‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్‌తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.
జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.
ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు.
జో రూట్‌కు స్వాగతం
మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్‌కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు.
ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు.
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెరలేచింది.
భారత తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.
చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment