జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్‌: రోహిత్‌ శర్మ | Rohit Sharma Comments On Century Vs England In 2nd ODI, Says Thats Where I Prepared My Plan Well, I Enjoy Batting With Gill | Sakshi
Sakshi News home page

Rohit Sharma: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్‌

Published Mon, Feb 10 2025 7:52 AM | Last Updated on Mon, Feb 10 2025 10:07 AM

Ind vs Eng Thats Where I Prepared My Plan Well Gill Is Classy Player: Rohit Sharma

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్‌(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్‌ ఆడి.. క్రికెట్‌ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.

నా గేమ్‌ప్లాన్‌ అదే
ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్‌ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం.

నిజానికి టీ20 ఫార్మాట్‌ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్‌ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.

నల్లరేగడి మట్టి పిచ్‌ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్‌ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్‌ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.

గిల్‌ క్లాసీ ప్లేయర్‌
గ్యాప్‌ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్‌ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill), శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్‌మ్యాన్‌.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. 

వాళ్లతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్‌​ చాలా చాలా క్లాసీ ప్లేయర్‌. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్‌ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్‌ శర్మ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు.

మిడిల్‌ ఓవర్లే ముఖ్యం
ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్‌ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్‌ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.

నాగ్‌పూర్‌లో కూడా మేము ఇదే విధంగా మిడిల్‌ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. 

కెప్టెన్‌, కోచ్‌ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

సిరీస్‌ కైవసం
కాగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(65), జో రూట్‌(69) అర్ధ శతకాలతో రాణించారు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్‌ షమీ, హర్షిత్‌ రాణా, హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి ఒక్కో వికెట్‌ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.

మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్‌ అయ్యర్‌(44), అక్షర్‌ పటేల్‌(41 నాటౌట్‌) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్‌’ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.

చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్‌ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement