క్రెడిట్‌ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్‌ | IND Vs ENG 1st ODI 2025, Disappointed Not To Win Credit Goes To Shreyas, Says Buttler In Post Match Presentation | Sakshi
Sakshi News home page

Jos Buttler: క్రెడిట్‌ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే

Published Fri, Feb 7 2025 12:00 PM | Last Updated on Fri, Feb 7 2025 1:43 PM

Ind vs Eng Disappointed Not To Win Credit Goes To Shreyas: Buttler

భారత్‌లో ఇంగ్లండ్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయిన బట్లర్‌ బృందం.. వన్డే సిరీస్‌(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.

క్రెడిట్‌ మొత్తం అతడికే
శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్‌ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్‌ మొత్తం శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్‌ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్‌ గెలిచిన బట్లర్‌ తొలుత బ్యాటింగ్‌ వైపు మొగ్గుచూపాడు.

అతడి రనౌట్‌లో అయ్యర్‌ కీలక పాత్ర
ఈ క్రమంలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్‌ హర్షిత్‌ రాణా సైతం మెయిడిన్‌ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో హర్షిత్‌ రాణాకు చుక్కలు చూపించాడు.

ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్‌ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. భారత స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఫీల్డింగ్‌ కారణంగా సాల్ట్‌(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్‌) వెనుదిరిగాడు.

 

ఇక మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రీఎంట్రీ స్టార్‌ జో రూట్‌(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్‌ హర్షిత్‌ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్‌, జాకొబ్‌ బెతెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

బట్లర్‌ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్‌ 64 బాల్స్‌ ఎదుర్కొని 51 రన్స్‌ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్‌ లివింగ్‌స్టోన్‌(5), బ్రైడన్‌ కార్సే(10), ఆదిల్‌ రషీద్‌(8) త్వరత్వరగా పెవిలియన్‌ చేరగా.. టెయిలెండర్‌ జోఫ్రా ఆర్చర్‌ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

38.4 ఓవర్లలోనే..
ఫలితంగా ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ షమీ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(15), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(2) విఫలమైనా.. శుబ్‌మన్‌ గిల్‌ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. 

అతడికి తోడుగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు.

మా ఓటమికి కారణం అదే
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్‌ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్‌ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.

ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్‌ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్‌ అయ్యర్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్‌ వల్ల భారత్‌కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్‌ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. 

చదవండి: IND vs ENG: శ్రేయస్‌ అయ్యర్‌ వరల్డ్‌​ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement