రాణించిన జడ్డూ, శ్రేయస్‌, గిల్‌, అక్షర్‌.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం | India Beat England By 4 Wickets In 1st ODI | Sakshi
Sakshi News home page

రాణించిన జడ్డూ, శ్రేయస్‌, గిల్‌, అక్షర్‌.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

Published Thu, Feb 6 2025 9:10 PM | Last Updated on Thu, Feb 6 2025 9:10 PM

India Beat England By 4 Wickets In 1st ODI

ఇంగ్లండ్‌తో (England) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీశారు.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ (52), జేకబ్‌ బేతెల్‌ (51) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (32), ఫిలిప్‌ సాల్ట్‌ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్‌ 19, బ్రూక్‌ 0, లివింగ్‌స్టోన్‌ 5, కార్స్‌ 10, ఆదిల్‌ రషీద్‌ 8, సాకిబ్‌ మహమూద్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో ఇంగ్లండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (2), యశస్వి జైస్వాల్‌ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ (59), శుభ్‌మన్‌ గిల్‌ (87), అక్షర్‌ పటేల్‌ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మధ్యలోనే భారత్‌ గెలుపు ఖరారు చేశాడు. 

లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా (9 నాటౌట్‌), రవీంద్ర జడేజా (12 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాకిబ్‌ మహమూద్‌, ఆదిల్‌ రషీద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్‌, జేకబ్‌ బేతెల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్‌ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.

జడేజా@600
ఈ మ్యాచ్‌లో టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

జడ్డూకు ముందు అనిల్‌ కుంబ్లే (953), అశ్విన్‌ (765), హర్భజన్‌ సింగ్‌ (707), కపిల్‌ దేవ్‌ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్‌ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌, అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌ జడేజానే.

అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్‌
ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్‌ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఫిల్‌ సాల్ట్‌ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్‌ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.

కొనసాగిన రోహిత్‌ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్‌లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్‌ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్‌ చేసింది  కేవలం 166 పరుగులే. 

విరాట్‌ దూరం.. పంత్‌కు నో ప్లేస్‌
ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్‌లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్‌లో మరో భారత స్టార్‌ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు.  వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ అదనంగా వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు మోశాడు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement