CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌..? | Ravindra Jadeja ODI Retirement Confirmed, Virat Kohli Act In CT 2025 Final Sparks Speculation | Sakshi
Sakshi News home page

CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌..?

Published Sun, Mar 9 2025 7:12 PM | Last Updated on Sun, Mar 9 2025 7:28 PM

Ravindra Jadeja ODI Retirement Confirmed, Virat Kohli Act In CT 2025 Final Sparks Speculation

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ తర్వాత టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్‌ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్‌ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్‌.. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను కూడా ఇలాగే హగ్‌ చేసు​కున్నాడు. ఆ మ్యాచ్‌ అనంతరం​ స్టీవ్‌ స్మిత్‌ వన్డేలకు గుడ్‌ బై చెప్పాడు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత జడేజా కూడా రిటైర్‌ అవుతాడని సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.

కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ కీలకమైన టామ్‌ లాథమ్‌ వికెట్‌ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్‌ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసి న్యూజిలాండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్‌ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. 

ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్‌ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జడేజాతో పాటు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించినా టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్‌ బ్యాటర్లు మంచి స్కోర్‌నే చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 15, రచిన్‌ రవీంద్ర 37, కేన్‌ విలియమ్సన్‌ 11, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 34, మిచెల్‌ సాంట్నర్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్‌ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్‌ 59/0గా ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement