
20 రోజుల పాటు సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటితో (మార్చి 9) ఫైనల్‌తో ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
కాగా, నిన్నటి ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా పోడియంపై ఒక్క పాకిస్తాన్ ప్రతినిథి కూడా కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి పోడియంపై ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ అంశాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్‌మీడియా వేదికగా లేవనెత్తాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడమేంటని ప్రశ్నించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.
వాస్తవానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు టోర్నీ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ నుంచి ఒక్కరైనా హాజరు కావాల్సి ఉండింది. అయితే అలా జరగలేదు. ముగింపు వేడుకకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి ఉన్నా రాలేదు. బదులుగా, పాకిస్తాన్ లెగ్ మ్యాచ్‌లు నిర్వహించిన టోర్నీ డైరెక్టర్ సుమైర్ అహ్మద్‌ను పంపారు.
ప్రోటోకాల్ ప్రకారం ముగింపు వేడుకల్లో పోడియంపైకి బోర్డు ద్వారా ఎన్నికైన సభ్యులు లేదా డైరెక్టర్లను మాత్రమే అనుమతిస్తారు. సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే కావడంతో అతన్ని పోడియంపైకి అనుమతించలేదు. దుబాయ్ లెగ్‌కు బాధ్యత వహించిన మరో టోర్నమెంట్ డైరెక్టర్ ఆండ్రీ రస్సెల్‌ను కూడా పోడియంపైకి పిలువ లేదు. మొత్తంగా పాకిస్తాన్ ప్రతినిథి లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుక ముగిసింది.
ముగింపు వేడుకలో ఐసీసీ తరఫున చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే, ఉత్కంఠగా సాగిన నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు.
అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment