
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్‌ను విస్మరించాడు. తన ట్వీట్‌లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్‌గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్‌లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు.
ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్‌కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు.
టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు.
తాజాగా టోర్నీ సక్సెస్ నోట్‌లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.
ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్‌లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్‌కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.
కాగా, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్‌పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment