
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ వ్యక్తిగత జీవితం గురుంచి గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ కొంతకాలం తర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై గిల్ కానీ సారా కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ గిల్‌తో తాను డేటింగ్ చేయడం లేదని సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది.
వీరిద్దరి తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనన్య మాత్రం ఖండించింది. అవన్నీ వట్టి రూమర్సే అని కొట్టిపారేసింది. తాజాగా తన రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలపై గిల్ స్పందించాడు. గత మూడేళ్ల నుంచి తాను ఒంటరిగా ఉన్నానని గిల్ చెప్పుకొచ్చాడు.
"నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. గత మూడేళ్ల నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. ఇటీవల కాలంలో చాలా మందితో నన్ను ముడిపెట్టారు. నా వ్యక్తిగత జీవితంపై చాలా ఊహాగానాలు, పుకార్లు ప్రచారం చేశారు. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం.
ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఒకరితో ప్రేమాయణం నడిపే అంత సమయం నా దగ్గర లేదు. మేము ఎక్కడక్కడికో ప్రయాణిస్తుంటాము. ప్రొఫెషనల్ కెరీర్‌తో బీజీగా ఉన్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు.
చదవండి: బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్‌కు మరో ఆఫర్?