
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.
చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్‌పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్‌లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్‌లో (బర్మింగ్హమ్) పాక్ భారత్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్‌లో మరోసారి పాక్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
2013 ఎడిషన్‌లో భారత్, పాక్‌లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్‌ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్‌లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.
2017 ఎడిషన్‌లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్‌దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.
2017 ఎడిషన్‌లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్‌ను ఓడించి తమ తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఓవల్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్‌పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
బలాబలాల విషయానికొస్తే.. పాక్‌తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కూడా మాంచి టచ్‌లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్‌కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా పాక్‌తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్‌లోకి వచ్చాడు.
ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్‌తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్‌లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్‌పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.
పాక్ విషయానికొస్తే.. భారత్‌తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్‌లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్‌లో లేదు.
బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్‌ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్‌పై పైచేయి సాధించేందుకు భారత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment