ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతున్న వేల మరో వివాదం తెరపైకి వచ్చింది. మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ భారత క్రికెటర్ల జెర్సీలపై తమ దేశం పేరును ముద్రించింది. ఇందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది.
తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్ పేరును తమ దేశ క్రికెటర్ల జెర్సీలపై ఉండేందుకు ఒప్పుకోమని భీష్మించుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. బీసీసీఐ అభ్యంతరాన్ని పీసీబీ కూడా అంతే గట్టిగా వ్యతిరేకిస్తుంది.
బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను లాగేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగే సమయంలో ఆ టోర్నీ పేరుతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా ఆయా జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని పీసీబీ ఆరోపిస్తుంది. వేదిక విషయంలో నానా యాగీ చేసిన బీసీసీఐ ఇప్పుడు జెర్సీల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని పాక్ మాజీలు మండిపడుతున్నారు.
జెర్సీల వివాదం నడుస్తుండగానే బీసీసీఐ తాజాగా ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఫోటో షూట్‌లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్లబోడని స్పష్టం చేసింది. ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను వేరే వేదికకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ ఐసీసీని కోరింది.
తాజా వివాదాల నేపథ్యంలో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టోర్నీ జరిగినా భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ పెడుతున్న కండీషన్లకు పీసీబీ ఒప్పుకునేలా కనిపించడం లేదు.
వేదిక విషయంలో తలోగ్గామని బీసీసీఐ ప్రతి విషయాన్ని రద్దాంతం చేస్తుందని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జెర్సీల విషయం అటుంచితే ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనేందుకు అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఐసీసీ పీఠంపై బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే. షా జోక్యంతో ఈ వివాదాలన్నిటికీ పుల్‌స్టాప్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీని సజావుగా సాగేలా చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి హోల్ అండ్ సోల్‌గా పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం తమ జట్టును పాక్ పంపబోమని తేల్చి చెప్పింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత పీసీబీ భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించుకునేందుకు ఒప్పుకుంది.
ఈ టోర్నీలో భారత్, పాక్ ఫైనల్‌కు చేరినా దుబాయ్‌లోనే ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్ ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment