
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్‌ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్‌లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్‌లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్‌కు చేరుకున్నాయి. 1996 వరల్డ్‌కప్ తర్వాత పాక్‌లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment