
అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారుతుంది. ఓ సారి వన్డే వరల్డ్‌కప్ (1996), ఓ సారి టీ20 వరల్డ్‌కప్ (2009), ఓ సారి ఛాంపియన్స్ ట్రోఫీ (2017) గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పసికూనలపై గెలిచేందుకు కూడా నానా తంటాలు పడుతుంది. గడిచిన రెండేళ్లలో పాక్ క్రికెట్ జట్టు అదఃపాతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా తయారైంది.
యూఎస్‌ఏ, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు సైతం పాక్‌ను మట్టికరిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా ఆ జట్టు మ్యాచ్‌లు గెలవలేకపోతుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై సిరీస్‌లోనూ పరాజయంపాలైంది. తాజాగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రక్షాళన పేరుతో సీనియర్లను పక్కన పెట్టిన పాక్ సెలెక్టర్లు ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక ఏం చేసినా తమ జట్టు పరిస్థితి బాగుపడదని అనుకుంటున్నారు.
భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే జట్లు సైతం పాక్‌ను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనకు ముందు పూర్వవైభవం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నోరు మెదపకుండా ఉంది. సీనియర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అన్నా ఉంటే కనీసం ఈ ఘోర పరాజయాల గోస తప్పేదని అనుకుంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడింది.
తొలి మ్యాచ్‌లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ముక్కీ మూలిగి 135 పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు గల్లీ బౌలర్లను తలపించారు. వరల్డ్ క్లాస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు.
ఓ ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది పక్కకు కూర్చోబెట్టాడు. మరో పేసర్ మొహమ్మద్ ఆలీని ఫిన్ అలెన్ వాయించాడు. ఆలీ వేసిన ఓ ఓవర్‌లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఈ సిరీస్ కోసం క్రికెట్ న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన సీనియర్లు ఐపీఎల్ కోసం భారత్‌కు పయనమయ్యారు. 'ఏ' జట్టుతోనే పాక్ పరిస్థితి ఇలా ఉంటే, సీనియర్లు ఉన్న జట్టు ఎదురైనప్పుడు పాక్ పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పాక్ క్రికెట్‌ను ఆదుకునే ఆపద్భాంధవుడెవరో చూడాలి.
2023 నుంచి పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి
ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి
వన్డే ప్రపంచ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం
2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణ
స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి
ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో షాకింగ్ ఓటమి
2024 టీ20 ప్రపంచ కప్‌లో యూఎస్‌ఏ చేతిలో ఊహించని పరాభవం
2024 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణ
జింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమణ
గత 16 టీ20ల్లో పాక్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వే, ఐర్లాండ్, కెనడాపై
Comments
Please login to add a commentAdd a comment