
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడం వల్ల పీసీబీకి రూ. 869 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పెట్టిన పెట్టుబడిలో 85 శాతం నష్టాలు వచ్చినట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన భారీ నష్టాలను.. ఆటగాళ్లపై ఆర్దిక అంక్షల ద్వారా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తుంది.
ఇందులో భాగంగా తొలుత దేశవాలీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో కోత విధించిన పీసీబీ.. తాజాగా జాతీయ ఆటగాళ్లపై కాస్ట్ కట్టింగ్ కొరడా ఝులిపించింది. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో సగానికిపైగా కోత విధించినట్లు తెలుస్తుంది. అలాగే పాక్ ఆటగాళ్లు ఫైవ్ స్టార్ హోటల్‌లలో బస చేయడంపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వేదికల ఆధునీకరణ (కరాచీ, లాహోర్, రావల్పిండి) కోసమే సగానికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. స్టేడియాల మరమ్మత్తుల కోసం ముందుగా అంచనా వేసిన వ్యయం కంటే 50 శాతం అధిక మొత్తం ఖర్చైనట్లు పాక్ మీడియా వెల్లడించింది. బదులుగా స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం గోరంత కూడా లేదని పేర్కొంది.
భారీ అంచనాల మధ్య స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో పాక్.. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుసగా ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దైంది.
భారత్‌తో మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడిన పాక్.. కోట్లు ఖర్చు చేసి స్వదేశంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. అందులోనూ న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తినింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అయినా గెలుద్దాం అనుకుంటే వరుణుడు కరుణించలేదు.
ఈ టోర్నీలో భారత్ చివరి వరకు అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్‌కు టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాల కంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలవడం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంది.
కాగా, పాక్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన సమస్యల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాక్‌లో ఆడేందుకు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment