
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు.
‘హోం అడ్వాంటేజ్’
మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్‌కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు.
మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు.
న్యాయంగానే గెలిచారు
అదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం.
‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్‌లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.
ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్‌కు వెళ్లింది.
ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్‌కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్‌కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.
ఆ విమర్శలతో ఏకీభవిస్తా
ఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్‌టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.
భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోనే రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ ఆడింది.
అయితే, టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసింది.
సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం విశేషం.
ఆ సత్తా భారత్‌కు మాత్రమే ఉంది
ఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు.
ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌లను ఆడే సత్తా భారత్‌కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్‌లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.
ఆసీస్‌తో టెస్టు, ఇంగ్లండ్‌తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు.
ప్రపంచ లీగ్ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.
కేవలం ఐపీఎల్ వల్ల కాదు..
ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.
రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు.
మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్‌లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్‌కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.
చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’