
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు.
సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.
అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్‌పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్‌గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్‌లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్‌కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్‌కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్‌కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.
ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్‌లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.
కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.
ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment