
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.
వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.
కూల్‌గా, పక్కా ప్రణాళికతో
ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.
అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు.
అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్‌లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.
ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.
అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.
చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment