
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.
ఆరంభంలో ఓపెనర్‌గా
కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.
టీ20లకు దూరం
ఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.
మారుస్తూనే ఉన్నారు
అయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.
ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్‌మెంట్ వాడుకుంటోంది.
ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్‌లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.
వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.
కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.
చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment