
భారత సంతతికి చెందిన చాలామంది క్రికెటర్లు ఇతర దేశాలకు ఆడి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్‌కు ఆడుతున్న భారత సంతతి ఆటగాడు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన నేపథ్యంలో భారత సంతతి క్రికెటర్ల ప్రస్తావన వచ్చింది. ఇతర దేశాలకు ఆడిన, ఆడుతున్న భారత సంతతి టాప్-10 క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
1. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
2. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)
3. ఐష్ సోధి (న్యూజిలాండ్)
4. నునీల్ నరైన్ (వెస్టిండీస్)
5. రవి బొపారా (ఇంగ్లండ్)
6. శివ్‌నరైన్ చంద్రపాల్ (వెస్టిండీస్)
7. మాంటి పనేసన్ (ఇంగ్లండ్)
8. తేజ నిడమనూరు (నెదర్లాండ్స్)
9. మోనాంక్ పటేల్ (యూఎస్‌ఏ)
10. మిలింద్ కుమార్ (యూఎస్‌ఏ)
రచిన్ రవీంద్ర- నవంబర్ 18, 1999న రచిన్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో బెంగళూరుకు చెందిన దంపతులకు జన్మించాడు. ఐదు సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన రచిన్.. తండ్రి రవి కృష్ణమూర్తిచే (మాజీ బెంగళూరు క్లబ్ ఆటగాడు) ప్రభావితం చేయబడ్డాడు. కృష్ణమూర్తి రచిన్ పేరును భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసొచ్చేలా పెట్టాడు. రచిన్ 2021లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రచిన్.. అనతికాలంలో స్టార్‌గా ఎదిగాడు.
కేశవ్ మహారాజ్- ఫిబ్రవరి 7, 1990న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన కేశవ్ మహారాజ్ భారతీయ కుటుంబం నుండి వచ్చాడు. కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారని తెలుస్తుంది. కేశవ్ 2016లో దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతికొద్ది కాలంలోనే టాప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో ఒకరిగా మారాడు. దక్షిణాఫ్రికా సాధించిన అనేక టెస్ట్ విజయాలలో మహారాజ్ కీలక పాత్ర పోషించాడు. 2021లో వెస్టిండీస్‌పై మహారాజ్ సాధించిన హ్యాట్రిక్ మరపురానిది.
ఐష్ సోధి- ఇందర్‌బీర్ సింగ్ 'ఇష్' సోధి అక్టోబర్ 31, 1992న పంజాబ్‌లోని లూథియానాలో జన్మించాడు. సోధి తన ప్రారంభ దినాలను న్యూజిలాండ్‌లో గడిపాడు. సోధి 2013లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సోధికి మంచి ప్రదర్శనకారుడిగా పేరుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో సోధి చెలరేగిపోతాడు.
సునీల్ నరైన్- 1988, మే 26న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన సునీల్ నరైన్ మిస్టరీ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. 2011లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన నరైన్.. 2012 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నరైన్ విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడతాడు.
రవి బొపారా- మే 4, 1985న లండన్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రవి బొపారా.. అన్ని ఫార్మాట్‌లలోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బొపారా.. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. వన్డే, టెస్ట్‌ల్లో బొపారాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
శివ్‌నరైన్ చంద్రపాల్- వెస్టిండీస్ క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకరైన శివ్‌నరైన్ చంద్రపాల్ ఆగస్టు 16, 1974న గయానాలోని ఒక భారతీయ కుటుంబంలో జన్మించాడు. 1994లో విండీస్ తరఫున అరంగేట్రం చేసిన చంద్రపాల్.. తన విలక్షణమైన బ్యాటింగ్ భంగిమతో ప్రసిద్ది చెందాడు. చంద్రపాల్ తన కెరీర్‌లో 20000కు పైగా పరుగులు సాధించాడు. ఘనమైన విండీస్ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మాంటీ పనేసర్- మద్‌సుదేన్ సింగ్ 'మాంటీ' పనేసర్ 1982 ఏప్రిల్ 25న ఇంగ్లండ్‌లోని లూటన్‌లో పంజాబీ దంపతులకు జన్మించాడు. మాంటీ 2006లో ఇంగ్లండ్ తరఫున టెస్ట అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మాంటీ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు. మాంటీ.. ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలుపుల్లో కీలకపాత్ర పోషించాడు.
తేజ నిడమనూరు- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్‌కు ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తేజ మంచి ప్రదర్శనకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ నెదర్లాండ్స్ గెలిచిన చాలా మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించాడు. నెదర్లాండ్స్‌కు రాకముందు తేజ క్రికెట్ అవకాశాల కోసం న్యూజిలాండ్‌లో గడిపాడు. ఆల్‌రౌండర్ అయిన తేజ ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మోనాంక్ పటేల్- గుజరాత్‌లో మే 1, 1993న జన్మించిన మోనాంక్ పటేల్ అమెరికాకు వలస వచ్చి అమెరికన్ క్రికెట్‌లో మంచి పేరు గడించాడు. పటేల్.. యూఎస్‌ఏ జట్టుకు టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా సేవలందస్తాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్, అంతకుముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్‌లో మోనాంక్ అద్భుత ప్రదర్శనలు చేశాడు.
మిలింద్ కుమార్- ఫిబ్రవరి 15, 1991న ఢిల్లీలో జన్మించిన మిలింద్ కుమార్ భారత దేశవాళీ క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. తదనంతరం అతను అమెరికాకు మకాం మార్చి అమెరికా జాతీయ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు. మిలింద్ అనతి కాలంలోనే యూఎస్‌ఏ జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment