రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్‌, శ్రీలంక టెస్ట్‌ మ్యాచ్‌ | SL VS NZ 1st Test Day 4 Stumps: New Zealand Need 68 Runs To Win Test Match | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్‌, శ్రీలంక టెస్ట్‌ మ్యాచ్‌

Published Sun, Sep 22 2024 7:07 PM | Last Updated on Sun, Sep 22 2024 7:07 PM

SL VS NZ 1st Test Day 4 Stumps: New Zealand Need 68 Runs To Win Test Match

న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌  రసవత్తకరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే మరో 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. మరో రోజు ఆట మిగిలి ఉంది. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం.. శ్రీలంకకే విజయావకాశాలు అధికంగా ఉన్నా.. కివీస్‌ను కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి ఉంది. 

కివీస్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర (91 నాటౌట్‌) క్రీజ్‌లో పాతుకుపోయి ఉన్నాడు. అజాజ్‌ పటేల్‌ (0 నాటౌట్‌), విలియమ్‌ ఓరూర్కీ సాయంతో అతను న్యూజిలాండ్‌ను గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రచిన్‌కు లోయర్‌ ఆర్డర్‌లో ఏ ఒక్కరి నుంచి సహకారం లభించినా పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ (4), మిచెల్‌ సాంట్నర్‌ (2), టిమ్‌ సౌథీ (2) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. 

టాపార్డార్‌లో డెవాన్‌ కాన్వే (4), డారిల్‌ మిచెల్‌ (8) సైతం తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. టామ​ లాథమ్‌ (28), కేన్‌ విలియమ్సన్‌ (30), టామ్‌ బ్లండెల్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

రాణించిన కరుణరత్నే, చండీమల్‌, మాథ్యూస్‌
అంతకుముందు శ్రీలంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్‌ (61), ఏంజెలో మాథ్యూస్‌ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్‌ పటేల్‌ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్‌ ఓరూర్కీ 3, సాంట్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

లాథమ్‌, విలియమ్సన్‌, మిచెల్‌ ఫిఫ్టీలు
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టామ్‌ లాథమ్‌ (70), కేన్‌ విలియమ్సన్‌ (55), డారిల్‌ మిచెల్‌ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (49 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (39), టామ్‌ బ్లండెల్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 4, రమేశ్‌ మెండిస్‌ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.

కమిందు సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్‌ (114) సెంచరీ.. కుసాల్‌ మెండిస్‌ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. కివీస్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌, అజాజ్‌ పటేల్‌ తలో 2, సౌథీ ఓ వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: సాయి సుదర్శన్‌ పోరాటం వృధా.. దులీప్‌ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement