ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక | Sri Lanka Beat New Zealand In First Test By 63 Runs At Galle, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

SL Vs NZ 1st Test: ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక

Published Mon, Sep 23 2024 11:05 AM | Last Updated on Mon, Sep 23 2024 12:51 PM

Sri Lanka Beat New Zealand In First Test By 63 Runs

గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ చివరి రోజు న్యూజిలాండ్‌ గెలవాలంటే 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఈ దశలో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు (207/8) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి, మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు తొలి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్‌ చేతులెత్తేయడం నిరాశ కలిగించింది.

ఓవర్‌నైట్‌ బ్యాటర్‌  రచిన్‌ రవీంద్ర (91) పోరాడతాడని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. అతను ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో పరుగు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య రచిన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివరి వికెట్‌ విలియమ్‌ ఓరూర్కీను కూడా జయసూర్యనే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 344 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 211 పరుగుల వద్ద ముగిసింది.

ప్రభాత జయసూర్య ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. రమేశ్‌ మెండిస్‌ 3, అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌తో పాటు టామ​ లాథమ్‌ (28), కేన్‌ విలియమ్సన్‌ (30), టామ్‌ బ్లండెల్‌ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

రాణించిన కరుణరత్నే, చండీమల్‌, మాథ్యూస్‌
అంతకుముందు శ్రీలంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్‌ (61), ఏంజెలో మాథ్యూస్‌ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్‌ పటేల్‌ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్‌ ఓరూర్కీ 3, సాంట్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

లాథమ్‌, విలియమ్సన్‌, మిచెల్‌ ఫిఫ్టీలు
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టామ్‌ లాథమ్‌ (70), కేన్‌ విలియమ్సన్‌ (55), డారిల్‌ మిచెల్‌ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (49 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (39), టామ్‌ బ్లండెల్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 4, రమేశ్‌ మెండిస్‌ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.

కమిందు సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్‌ (114) సెంచరీ.. కుసాల్‌ మెండిస్‌ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. కివీస్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌, అజాజ్‌ పటేల్‌ తలో 2, సౌథీ ఓ వికెట్‌ పడగొట్టారు.

చదవండి: క్లీన్‌ స్వీప్‌ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement