నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్‌.. సిరీస్‌ కైవసం | New Zealand Beat Sri Lanka By 45 Runs In 2nd T20, Clinches The Series | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్‌.. సిరీస్‌ కైవసం

Published Mon, Dec 30 2024 4:30 PM | Last Updated on Mon, Dec 30 2024 4:55 PM

New Zealand Beat Sri Lanka By 45 Runs In 2nd T20, Clinches The Series

మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు ​మ్యాచ్‌ సిరీస్‌ను కివీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఇవాళ (డిసెంబర్‌ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టిమ్‌ రాబిన్సన్‌ (41), మార్క్‌ చాప్‌మన్‌ (42), మిచెల్‌ హే (41 నాటౌట్‌) ఓ మోస్తరు​ స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌ రవీంద్ర 1, గ్లెన్‌ ఫిలిప్స్‌ 23, డారిల్‌ మిచెల్‌ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్‌ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్‌ తుషార, మతీశ పతిరణ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్‌ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌ సాంట్నర్‌ తలో రెండు.. మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, జకరీ ఫోల్క్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ పెరీరా (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్‌ నిస్సంక (37), చరిత్‌ అసలంక (20), కుసాల్‌ మెండిస్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్‌ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్‌ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.

తొలి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పెట్టిన డఫీ
న్యూజిలాండ్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డఫీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (62), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్‌ మెండిస్‌ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్‌ పేసర్లు మ్యాట్‌ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్‌ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement