NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్‌ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక | NZ Vs SL: New Zealand Beat Sri Lanka By 113 Runs In Second ODI, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

NZ Vs SL 2nd ODI: తీక్షణ హ్యాట్రిక్‌ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక

Jan 8 2025 3:36 PM | Updated on Jan 8 2025 3:43 PM

New Zealand Beat Sri Lanka By 113 Runs In Second ODI

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్‌ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. డారిల్‌ మిచెల్‌ (38), గ్లెన్‌ ఫిలిప్స్‌ (22), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్‌ యంగ్‌ 16, టామ్‌ లాథమ్‌ 1, నాథన్‌ స్మిత్‌ 0, మ్యాట్‌ హెన్రీ 1, విలియమ్‌ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్‌) చేశారు.

తీక్షణ హ్యాట్రిక్‌
ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. 35 ఓవ‌ర్‌లో ఆఖ‌రి రెండు బంతుల‌కు వ‌రుస‌గా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ త‌ర్వాత  37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో త‌న‌ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. 

మిచెల్ సాంట్నర్‌ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాథ‌న్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవ‌ర్లు వేసిన తీక్ష‌ణ 44 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్‌ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.

అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్‌ (64), జనిత్‌ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్‌ ఆఖరి బంతికి ఔట్‌ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. 

చమిందు విక్రమసింఘే (17) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం​ వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. 

లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్‌ మెండిస్‌ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్‌ పేసర్‌ విలియమ్‌ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్‌ వికెట్‌ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. జేకబ్‌ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్‌ హెన్రీ, నాథన్‌ స్మిత్‌, మిచెల్‌ సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్‌లో జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement