
మహిళల క్రికెట్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 16) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ శ్రీలంకను 113 పరుగులకే (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లు బ్రీ ఇల్లింగ్, జెస్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫ్లోరా డెవాన్‌షైర్, బ్రూక్ హ్యలీడే చెరో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ సూజీ బేట్స్ (4-1-16-0) వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కార (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. చమారీ ఆటపట్టు (23), కవిశ దిల్హరి (12), నిలాక్షి డిసిల్వ (20), హర్షిత మాధవి (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విష్మి గౌతమ్ డకౌట్ కాగా.. సుగంధిక కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సుజీ బేట్స్ (47), బ్రూక్ హ్యాలీడే (46 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి న్యూజిలాండ్‌ను గెలిపించారు. న్యూజిలాండ్ ప్లేయర్స్‌లో జార్జియా ప్లిమ్మర్ 4, ఎమ్మా మెక్‌లియాడ్ 11 పరుగులకు ఔటయ్యారు. హ్యాలీడే.. ఇజ్జీ షార్ప్‌తో (8 నాటౌట్) కలిసి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్పింది.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 18న డునెడిన్‌లో జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0 తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment