
పరిమత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు మల్కి మదారా 3, కవిష దిల్హరి, ఇనోషి ప్రియదర్శిని తలో 2, సుగంధిక కుమారి, చమారీ ఆటపట్టు చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా మెక్‌లియోడ్ (44), కెప్టెన్ సూజీ బేట్స్ (21), జెస్ కెర్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జార్జియా ప్లిమ్మర్ 2, బ్రూక్ హ్యాలిడే 4, ఇజ్జి షార్ప్ 0, మ్యాడీ గ్రీన్ 5, పోల్లి ఇంగ్లిస్ 4, రోస్‌మేరీ మైర్ 0, ఎడెన్ కార్సన్ 7 పరుగులు చేశారు. లంక బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అనంతరం ఓపెనర్ చమారీ ఆటపట్టు (48 బంతుల్లో 64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిలాక్షి డిసిల్వతో (12 నాటౌట్) కలిసి ఆటపట్టు లంకను విజయతీరాలకు చేర్చింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ 7, హర్షిత సమరవిక్రమ 2, కవిశ దిల్హరి 12 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 2 వికెట్లు పడగొట్టింది.
ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ముందుగా వన్డే సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేసింది. రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 16న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment