
న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఇవాళ (మార్చి 7) వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ అద్భుత సెంచరీతో (100) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.
జార్జియా ప్లిమ్మర్ 28, ఇసబెల్లా గేజ్ 19, జెస్ కెర్ 38, పోల్లీ ఇంగ్లిస్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సూజీ బేట్స్ 5, ఎమ్మా మెక్‌లియోడ్ 6, బ్రూక్ హ్యల్లీడే 6 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో జార్జియా ప్లిమ్మర్ కొద్ది సేపు సంయమనంతో బ్యాటింగ్ చేసింది. ప్లిమ్మర్ 54 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటైంది.
అనంతరం గ్రీన్.. గేజ్, కెర్, ఇంగ్లిస్ సహకారంతో సెంచరీ పూర్తి చేసుకుంది. గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టగా.. అచిని కులసూరియ, ఇనోషి ప్రియదర్శిని, కవిశ దిల్హరి తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 167 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు కుప్పకూల్చారు. హన్నా రోవ్ 4, బ్రీ లింగ్, ఏడెన్ కార్సన్ తలో 2, సూజీ బేట్స్ ఓ వికెట్ తీశారు. జెస్ కెర్ వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (59) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. కవిష దిల్హరి 25, నీలాక్షి డిసిల్వ 20, అనుష్క సంజీవని 13 (నాటౌట్), కుగంధిక కుమారి, కెప్టెన్ ఆటపట్టు తలో 11 పరుగులు చేశారు. మనుడి ననయక్కార, ఇనోషి ప్రియదర్శిని డకౌట్లు కాగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో నేపియర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడో వన్డే నెల్సన్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 14, 16, 18 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగనుండగా.. మూడో టీ20 డునెడిన్‌లో జరుగనుంది.