3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో చమారీ ఆటపట్టు (శ్రీలంక కెప్టెన్) విధ్వంసకర శతకంతో (80 బంతుల్లో 140 నాటౌట్; 13 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో శ్రీలంక మహిళా జట్టు చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక.. న్యూజిలాండ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
అలాగే, 2008లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత దాదాపు 15 ఏళ్లలో ఏ ప్రత్యర్థిపైనైనా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో గెలవడం లంకేయులకు ఇది తొలిసారి. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌పై 3 మ్యాచ్‌ల సిరీస్‌లో విజయం సాధించినప్పటికీ, అది 1-0 తేడాతో గెలిచింది (2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి).
కాగా, వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బేట్స్ (63 నాటౌట్), కెప్టెన్ సోఫీ డివైన్ (38 నాటౌట్) రాణించారు. ఈ సమయంలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు శ్రీలంకకు 29 ఓవర్లలో 196 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు.
మూడు మ్యాచ్‌ల్లో రెండు శతకాలు బాదిన లంక కెప్టెన్..
ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన లంక కెప్టెన్ చమారీ కేవలం 60 బంతుల్లోనే శతక్కొట్టింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ కాగా.. చమారీకి ఈ ఫార్మాట్‌లో ఇది 8వ శతకం. చమారీకి జతగా నిలక్షి డిసిల్వ (48 నాటౌట్) రాణించడంతో శ్రీలంక మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా సెంచరీ (108 నాటౌట్) సాధించిన చమారీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జులై 8 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment