3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా నిన్న (జూన్ 27) తొలి వన్డే జరిగింది. వర్షం కారణంగా 28 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (83 బంతుల్లో 108; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత శతకంతో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు విష్మి గుణరత్నే (50) సహకరించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మెలీ కెర్ర్ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మ్యాడీ గ్రీన్ (39), బేట్స్ (28), ప్లిమ్మర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో సుగంధిక కుమారి, కవిష దిల్హరి, రణవీర తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారి ఆటపట్టు (108 నాటౌట్), విష్మి గుణరత్నే (50) చెలరేగడంతో 27 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి శ్రీలంక క్రికెటర్‌గా చమారి రికార్డు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో విజృంభించిన లంక కెప్టెన్ చయారి ఓ అరుదైన రికార్డు సాధించింది. శ్రీలంక తరఫున మహిళల క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. చమారి 93 వన్డేల్లో 33.61 సగటున 3059 పరుగులు సాధించింది. ఓవరాల్‌గా మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 7805 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment