Chamari Athapaththu
-
సుందర్‌కు నిరాశ.. ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అట్కిన్సన్
జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్కు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్నే వరించింది. ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్‌తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
Chamari Athapaththu: మహిళా క్రికెట్‌పై.. పట్టు!
83 బంతుల్లో అజేయంగా 108 పరుగులు, 80 బంతుల్లో 140 నాటౌట్, 47 బంతుల్లో అజేయంగా 80 పరుగులు, 31 బంతుల్లో 55, 28 బంతుల్లో 44, 139 బంతుల్లో 195 నాటౌట్, 46 బంతుల్లో 73.. ఇటీవల కీలక మ్యాచ్‌లలో చమరి అటపట్టు సాధించిన స్కోర్లు ఇవి. న్యూజీలండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ఠ జట్లపై శ్రీలంక సాధించిన అరుదైన, చారిత్రక విజయాలన్నిట్లో అటపట్టుదే కీలక పాత్ర. లంక జట్టుకు వెన్నుదన్నుగానే కాదు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు సాధిస్తూ వరల్డ్ నంబర్‌వన్‌గానూ కొనసాగుతోంది. ఈ ఆటకు ఆమె నాయకత్వ ప్రతిభా తోడై శ్రీలంకకు మహిళా ఆసియా కప్ టోర్నీని అందించింది. ఇందులో అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని, ఏడుసార్లు విజేతైన భారత్‌కు ఫైనల్లో షాక్ ఇస్తూ లంక టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో చమరి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 304 పరుగులు అదీ 147 స్ట్రైక్ రేట్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.ప్రతి క్రీడలో ఆ దేశపు జాతీయ పతాకాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఒక ప్లేయర్ అవసరమవుతారు. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా సదరు క్రీడపై అందరి దృష్టి పడేలా చేయడం, ఆపై తన వ్యక్తిగత ఆటతో జట్టు స్థాయిని కూడా పెంచడం ఆ ‘ట్రయల్ బ్లేజర్’కే సాధ్యం. శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి చమరి అటపట్టు పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టువి అరకొర విజయాలే తప్ప అసాధారణ ప్రదర్శన కాదు. కానీ చమరి తన ఆటతో ఇతర జట్ల దృష్టి తమ టీమ్‌పై పడేలా చేసింది. తన19వ ఏట, 2009 టి20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2011 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 60 పరుగులు సాధించడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాతి ఏడాదే శ్రీలంక అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకోవడంతో చమరి శకం మొదలైంది.రికార్డులే రికార్డులు..వన్డే క్రికెట్లోకి చమరి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో చెలరేగింది. ఫలితంగా శ్రీలంక తరఫున వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు వన్డేల్లో ఆమె మొత్తం తొమ్మిది శతకాలు బాదగా.. మరే శ్రీలంక ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం! అంతర్జాతీయ టి20ల్లో కూడా మూడు సెంచరీలతో ఆమె ఏకైక స్టార్‌గా నిలిచింది. 2017 వన్డే వరల్డ్ కప్‌లో నంబర్‌వన్ టీమ్ ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 178 పరుగుల ఇన్నింగ్స్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మిగిలింది.34 ఏళ్ల 88 రోజుల వయసులో స్కాట్లండ్‌పై శతకం బాదిన చమరి.. అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి అన్ని వన్డే, టి20 బ్యాటింగ్ రికార్డులు చమరి పేరిటే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న చమరి మూడు టి20 వరల్డ్ కప్(2018, 2020, 2023)లలో శ్రీలంక టీమ్ సారథిగా వ్యవహరించింది. ఆమె కెప్టెన్సీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టి20ల్లో, న్యూజీలండ్పై వన్డేల్లో తొలిసారి శ్రీలంక సిరీస్‌ను గెలుపొందింది. అయితే కెప్టెన్‌గా ఆమె కెరీర్లో అత్యుత్తమ విజయం ఇటీవల ఆసియా కప్‌ను అందుకోవడమే. అసలు భారత జట్టును ఎదురునిలవడమే అసాధ్యం, భారత్ మినహా ఇతర బలహీన టీమ్‌లతో టోర్నీని నిర్వహించడమే అనవసరం అనే విమర్శల నేపథ్యంలో.. చమరి తన టీమ్‌ను ఆసియా విజేతగా నిలపడంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరింది.ఫ్రాంచైజీ క్రికెట్లో..వరల్డ్ క్రికెట్లో దూకుడైన బ్యాటర్‌గా, భారీ హిట్టర్‌గా చమరికి వచ్చిన గుర్తింపు ఫ్రాంచైజీ క్రికెట్లో వరుస అవకాశాలనిచ్చింది. లంక తరఫున ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. ప్రతిజట్టూ తమ టీమ్‌లో ఆమెను ఎంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనగెడ్స్ జట్ల తరఫున, ఇంగ్లండ్ టీమ్‌లు ఓవల్ ఇన్విన్సిబుల్స్, యార్క్‌షైర్ డైమండ్స్, దక్షిణాఫ్రికా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్టిండీస్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌తో పాటు బీసీసీఐ నిర్వహించిన లీగ్ టోర్నీల్లో సూపర్ నోవాస్, యూపీ వారియర్స్‌కి చమరి ప్రాతినిధ్యం వహించింది.2023–24 ఆస్ట్రేలియా క్రికెట్ విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో 130 స్ట్రైక్‌రేట్‌తో 511 పరుగులు సాధించి ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లో అటపట్టు ప్రభావం ఎంతగా ఉందంటే లీగ్‌లో ‘చమరి బే’ పేరుతో ప్రత్యేక సీటింగ్ జోన్ ఏర్పాటు చేసేంతగా! ఆమె కెరీర్లో మరో అత్యుత్తమ క్షణమూ ఇటీవలే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డ పోష్స్ట్రూమ్లో జరిగిన వన్డేలో చమరి 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 195 పరుగులు తీసి అజేయంగా నిలిచి, తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆమె బ్యాటింగ్‌తో శ్రీలంక.. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (302) ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్న చమరి అటపట్టు రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఘనతలు అందుకోవడం, రికార్డులు సృష్టించడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది. -
నరాలు తెగే ఉత్కంఠ: పాక్‌ను ఓడించిన లంక.. ఫైనల్‌కు సై
మహిళల ఆసియా కప్-2024 టోర్నీలో శ్రీలంక సత్తా చాటింది. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టును ఢీకొట్టనుంది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.నిదా రాణించినాఈ క్రమంలో ఓపెనర్లు గుల్ ఫెరోజా 25, మునీబా అలీ 37 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అమీన్(10) పూర్తిగా నిరాశపరిచింది. కెప్టెన్ నిదా దర్ 17 బంతుల్లో 23 పరుగులతో రాణించగా.. అలియా రియాజ్(16), ఫాతిమా సనా(23) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 140 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో ప్రభోదని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైదా ఇక్బాల్ బౌలింగ్‌లో ఓపెనర్ విష్మీ గుణరత్నె డకౌట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్షిత విక్రమసింహ సైతం సైదా బౌలింగ్‌లో 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ చమరి ఆటపట్టు మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.నలభై ఎనిమిది బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 63 పరుగులు చేసి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతావాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అనుష్క సంజీవని 24 పరుగులతో రాణించింది. అయితే, ఆఖరి ఓవర్లో లంక విజయానికి 3 పరుగులు అవసరం కాగా.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.తీవ్ర ఉత్కంఠఈ క్రమంలో పాక్ కెప్టెన్ నిదా దర్ డాట్ బాల్‌తో ఆరంభించి.. రెండో బంతికే సుగందిక కుమారి(10)ని బౌల్డ్ చేసింది. మరుసటి బంతికి కూడా శ్రీలంక పరుగు రాబట్టలేకపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. నాలుగో బంతికి అచిని కులసూర్య సింగిల్ తీసింది. అనంతరం నిదా వైడ్ వేయగా.. ఇరు జట్ల స్కోరు సమమైంది. ఈ క్రమంలో ఐదో బంతికి సంజీవని సింగిల్ తీయడంతో పాక్ కథ సమాప్తమైంది.ఫైనల్లో భారత్‌తో ఢీనిదా దర్ బృందంపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య శ్రీలంక ఆసియా టీ20 కప్-2024 ఫైనల్‌కు దూసుకువెళ్లింది. టైటిల్ కోసం ఆదివారం హర్మన్‌ప్రీత్ కౌర్ సేనతో ఆటపట్టు జట్టు తలపడనుంది. కాగా పాక్‌పై గెలుపు ఖరారు కాగానే లంక ఆటగాళ్ల సంబరం అంబరాన్నంటింది. మైదానంలోకి దూసుకువచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న చమరి ఆటపట్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.చదవండి: ఫైనల్లో టీమిండియా𝗦𝗿𝗶 𝗟𝗮𝗻𝗸𝗮 𝗵𝗮𝘀 𝗱𝗼𝗻𝗲 𝗶𝘁 𝗮𝗴𝗮𝗶𝗻! 🇱🇰🔥#ChamariAthapaththu & co. have defeated Pakistan in consecutive #WomensAsiaCup semi-finals 💪On to the finals, they go! 😍#SLvIND | SUN, JUL 28, 2:30 PM | #WomensAsiaCupOnStar (Only available in India) pic.twitter.com/epH8JJkQq2— Star Sports (@StarSportsIndia) July 26, 2024 -
40 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్.. 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2024లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్(10) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది.లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..⇒మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.⇒అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్ రికార్డును ఆతపత్తు బ్రేక్ చేసింది.⇒అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్ స్పిన్నర్
విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. 2024 మే నెలకు గానూ మోటీని ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం మోటీతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది, ఐర్లాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ పోటీపడ్డారు. ముగ్గురిలో మోటీకే అత్యధిక ఓట్లు రావడంతో ఐసీసీ అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ప్రకటించింది. మోటీ గడిచిన నెలలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మోటీ మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు షాహిన్ అఫ్రిది గడిచిన నెలలో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో 14.5 సగటున 10 వికెట్లు (టీ20ల్లో) పడగొట్టాడు. లోర్కాన్ టక్కర్ విషయానికొస్తే.. ఈ ఐరిష్ బ్యాటర్ మే నెలలలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 37.83 సగటున 227 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫిఫ్టి, నాలుగు 40 ప్లస్ స్కోర్లు ఉన్నాయి.మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ (మే) విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం శ్రీలంక స్టార్ బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ సోఫీ ఎక్లెస్టోన్, స్కాట్లాండ్ బౌలర్ కేథరీన్ బ్రైస్ పోటీపడగా.. మే నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ చమారీనే ఈ అవార్డు వరించింది. చమారీ మే నెలలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 37.75 సగటున 151 పరుగులు చేసి బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టింది. -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
ఏప్రిల్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ పేసర్ షహీన్ అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ ఉన్నారు. వీరిముగ్గురూ ఏప్రిల్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. అఫ్రిది విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లొ అదరగొట్టాడు.ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షాహీన్.. 8 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డకు నామినేట్ చేసింది. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.. ఒమన్ పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒమన్‌తో టీ20 సిరీస్‌ను నమీబియా సాధించడంలో ఎరాస్మస్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం సైతం ఏప్రిల్ నెలలో అదరగొట్టాడు. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో వసీం దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఏప్రిల్ నెలలో వసీం 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. ఇక మహిళలల విభాగంలో శ్రీలం కెప్టెన్ చమరి అతపట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు రేసులో ఉన్నారు. -
శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అత్యంత అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టి రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్లో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు. వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది. రికార్డు విజయం కూడా ఇక ఈ మ్యాచ్‌లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే! వన్డేల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు 1. గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్‌కప్- 201 రన్స్(నాటౌట్) 2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్) 3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్) 4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్) 5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్. చదవండి: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి