మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.
భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.
డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
అందుకే ఓడిపోయాం
స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.
ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment