చమరి ఆటపట్టు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్‌వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది.
ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టి
రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు.
వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా
అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది.
రికార్డు విజయం కూడా
ఇక ఈ మ్యాచ్‌లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే!
వన్డేల్లో సక్సెస్‌ఫుల్ రన్‌ఛేజ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు
1. గ్లెన్ మాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్‌కప్- 201 రన్స్(నాటౌట్)
2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్)
3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్)
4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్)
5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్.
Comments
Please login to add a commentAdd a comment