గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 205/5 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.
ఛేదనలో శ్రీలంక 238 పరుగులకే చాపచుట్టేసింది. కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. రబాడ, డేన్ పీటర్సన్ తలో రెండు వికెట్లు.. జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (50) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కుసాల్ మెండిస్ (46), కమిందు మెండిస్ (35), ఏంజెలో మాథ్యూస్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.
దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment