
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు కరుణ్ నాయర్ డకౌటైనా ఓ అరుదైన రికార్డును సెట్ చేశాడు. ఐపీఎల్‌లో ఐదు టై అయినా మ్యాచ్‌ల్లో భాగమైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
జస్ప్రీత్ బుమ్రా, క్రిస్ గేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో నాలుగు టై మ్యాచ్‌ల్లో భాగంగా ఉన్నారు. వీరందరితో పోలిస్తే కరుణ్ అతి తక్కువ మ్యాచ్‌లు (78) ఆడి అత్యధికంగా ఐదు టై మ్యాచ్‌ల్లో భాగమైన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్‌లో కరుణ్ భాగమైన టై మ్యాచ్‌లు..
2013లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్
2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్
2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్
2015లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ
2025లో ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
ఢిల్లీ, రాయల్స్ తాజా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (49), కేఎల్ రాహుల్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ చేసినన్ని పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (51), సంజూ శాంసన్ (31 రిటైర్డ్ హర్ట్), నితీశ్ రాణా (51) రాణించినా చివరి ఓవర్‌లో రాయల్స్ తడబడింది.
స్టార్క్ 18, 20వ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి బంతికి రాయల్స్ గెలుపుకు 2 పరుగులు అవసరం కాగా.. జురెల్ ఒక్క పరుగు మాత్రమే తీసి రనౌటయ్యాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. స్టార్క్ ఇక్కడ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 11 పరుగులు మాత్రమే చేసింది. ఇద్దరు ఆటగాళ్లు ఔట్ కావడంతో రాయల్స్ కేవలం 5 బంతులు మాత్రమే ఆడగలిగింది. నాలుగు, ఐదు బంతుల్లో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ రనౌటయ్యారు.
12 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నాలుగో బంతికే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ బరిలోకి దిగారు. రాహుల్ తొలి బంతికి 2, రెండో బంతికి బౌండరీ, మూడో బంతికి సింగిల్ తీయగా.. స్టబ్స్ నాలుగో బంతికి సిక్సర్ బాది ఢిల్లీని గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 15వ టై మ్యాచ్ కాగా.. 2022 నుంచి ఇదే మొదటిది.