
డబ్ల్యూపీఎల్ 2025 (WPL-2025) సీజన్ కోసం యూపీ వారియర్జ్ (UP Warriorz) ఆసీస్ యువ బ్యాటర్ జార్జియా వాల్‌తో (Georgia Voll) ఒప్పందం కుదర్చుకుంది. స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ప్లేయర్ చమారీ ఆటపట్టు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు (మార్చి 4 నుంచి శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది) లీగ్ నుంచి వైదొలగడంతో వారియర్జ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో ఆటపట్టు స్థానాన్ని వాల్ భర్తీ చేస్తుందని వారియర్జ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. వాల్‌ను వారియర్జ్ 30 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. వాల్ చేరికతో వారియర్జ్ బ్యాటింగ్ విభాగం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా తరఫున ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వాల్.. మూడు ఫార్మాట్లలో ఆకట్టుకుంది.
21 ఏళ్ల వాల్ తన రెండో వన్డేలోనే సెంచరీ చేసి సత్తా చాటింది. వాల్ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 3 వన్డేలు, 3 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడింది. వాల్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లో వాల్ పలు 90 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. ఇటీవల ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డుల్లో వాల్ ఉత్తమ దేశవాలీ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది.
కాగా, ప్రస్తుత డబ్ల్యూపీఎల్ ఎడిషన్‌లో యూపీ వారియర్జ్ చెప్పుకోదగ్గ ప్రదర్శలు చేయడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే గెలుపొందింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో వారియర్జ్ ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది.
అంతకుముందు వారియర్జ్ ఆర్సీబీపై సూపర్ ఓవర్‌లో సంచలన విజయం సాధించింది. దీనికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. వారియర్జ్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలడనుంది. ఈ మ్యాచ్ మార్చి 3న జరుగనుంది.
నిన్నటి మ్యాచ్‌లో వారియర్జ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై ఈ సీజన్‌లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో యూపీ వారియర్జ్ పూర్తి జట్టు..
కిరణ్ నవ్‌గిరే, బృందా దినేష్, దీప్తి శర్మ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హారిస్, ఉమా చెత్రీ (వికెట్‌కీపర్), చినెల్ హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకోర్, క్రాంతి గౌడ్, గౌహెర్ సుల్తానా, చమారి అటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్, అలానా కింగ్, అంజలి సర్వాణి, అరుషి గోయెల్, పూనమ్ ఖేమ్నార్
Comments
Please login to add a commentAdd a comment