
12 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ గెలుపు
జార్జియా వోల్ 99 నాటౌట్
యూపీని వణికించిన రిచా, స్నేహ్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రకెక్కిన పరుగుల పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు పోరాడి ఓడింది. డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. గెలిస్తే రేసులో నిలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 12 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తాజా ఫలితంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీ ఇదివరకే ప్లేఆఫ్స్ చేరింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు కాగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వోల్ (56 బంతుల్లో 99 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. కిరణ్ నవ్‌గిరే (16 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడేసింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్‌హమ్ 2 వికెట్లు తీసింది.
అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (33 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్నేహ్ రాణా (6 బంతుల్లో 26; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో యూపీ శిబిరాన్ని వణికించారు. సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తిశర్మ చెరో 3 వికెట్లు తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా యూపీ ప్లేయర్ తమ రెగ్యులర్ టీమ్ కిట్‌కు బదులుగా గులాబీ రంగు జెర్సీలను ధరించారు.
జార్జియా ‘జిగేల్’
సొంత మైదానంలో ఆఖరి పోరులో బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, జార్జియా వోల్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. బంతిని అదేపనిగా బౌండరీని దాటించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పవర్‌ప్లేలో 67 పరుగులు రాబట్టింది. గ్రేస్ హారిస్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
అయితే కిరణ్ నవ్‌గిరే రావడంతో మరో మెరుపు భాగస్వామ్యం నమోదైంది. 9.3 ఓవర్లలోనే వారియర్స్ స్కోరు వందకు చేరుకుంది. 13వ ఓవర్లో కిరణ్ అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా... మరోవైపు జార్జియా వోల్ కడదాకా అజేయంగా క్రీజులో నిలిచింది. పరుగు తేడాతో సెంచరీ భాగ్యాన్ని దక్కించుకోలేక పోయింది. ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో దీప్తి రనౌటైంది.
రిచా ధనాధన్ షో వృథా
మూడో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (4), మరుసటి ఓవర్లో మేఘన (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పవర్ ప్లే తర్వాత ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 28; 6 ఫోర్లు), రాఘ్వి బిస్త్ (14), కనిక (8) ని్రష్కమించడంతో 107/5 స్కోరు వద్ద బెంగళూరు ఆశలు ఆడుగంటాయి.
ఈ దశలో హిట్టర్ రిచా ఘోష్ అసాధారణ పోరాటం చేసింది. భారీ సిక్స్‌లు, చూడచక్కని బౌండరీలతో విజయంపై ఆశలు రేపింది. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకుంది. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో రిచా అవుటైంది. చార్లీ డీన్ (9), జార్జియా వేర్‌హామ్ (17) నిరాశపరిచారు.
4, 6, 6, 4, 6, అవుట్
19వ ఓవర్లో స్నేహ్ రాణా మెరుపులు బెంగళూరులో ఆశలు రేపాయి. దీప్తి వేసిన ఈ ఓవర్లో కిమ్‌గార్త్ సింగిల్ తీసి స్నేహ్‌కు స్ట్రయిక్ ఇచ్చింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆమె 4, 6, 6, 4(నోబాల్), 6లతో చకచకా 26 పరుగులు చేసింది. 7 బంతుల్లో 15 పరుగుల సమీకరణం సులువనిపించింది. కానీ ఆఖరి బంతికి స్నేహ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద పూనమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యూపీ ఊపరి పీల్చుకుంది.
స్కోరు వివరాలు
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ రనౌట్ 39; జార్జియా వోల్ నాటౌట్ 99; కిరణ్ (సి) పెర్రి (బి) వేర్‌హామ్ 46; చినెల్లీ హెన్రీ (సి) స్మృతి (బి) వేర్‌హామ్ 19; సోఫీ (బి) చార్లీడీన్ 13; దీప్తిశర్మ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–77, 2–148, 3–191, 4–223, 5–225. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–42–0, రేణుక సింగ్ 3–0–42–0, చార్లీ డీన్ 4–0–47–1, ఎలీస్ పెర్రి 4–0–35–0, జార్జియా వేర్‌హామ్ 4–0–43–2, స్నేహ్ రాణా 1–0–13–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) వోల్ (బి) సోఫీ 27; స్మృతి మంధాన (సి) వోల్ (బి) హెన్రీ 4; ఎలిస్ పెర్రి (బి) అంజలి 28; రాఘ్వి బిస్త్ (సి) ఉమాఛెత్రి (బి) హెన్రీ 14; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) దీప్తిశర్మ 69; కనిక (బి) దీప్తి శర్మ 8; జార్జియా వేర్‌హమ్ (సి) సబ్–ఆరుశ్రీ (బి) సోఫీ 17; చార్లీ డీన్ (సి) కిరణ్ (బి) సోఫీ 9; కిమ్‌గార్త్ నాటౌట్ 3; స్నేహ్ రాణా (సి) పూనమ్ (బి) దీప్తిశర్మ 26; రేణుక రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1–29, 2–43, 3–76, 4–80, 5–107, 6–171, 7–182, 8–183, 9–211, 10–213. బౌలింగ్: చినెల్లీ హెన్రీ 4–0–39–2, గ్రేస్ హారిస్ 1–0–22–0, సోఫి ఎకిల్‌స్టోన్ 4–0–25–3, క్రాంతి గౌడ్ 3–0–35–0, అంజలి శర్వాణి 3–0–40–1, దీప్తిశర్మ 4–0–50–3, జార్జియా వోల్ 0.3–0–2–0.
Comments
Please login to add a commentAdd a comment