
యూపీపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం
హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
ఐదు వికెట్లతో మెరిసిన అమెలియా కెర్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ దశకు చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
జార్జియా వోల్ (33 బంతుల్లో 55; 12 ఫోర్లు) డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధశతకంతో ఆకట్టుకోగా... గ్రేస్ హ్యారిస్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దీప్తి శర్మ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కిరణ్ నవ్‌గిరె (0), షినెల్ హెన్రీ (6), శ్వేత సెహ్రావత్ (0), ఉమా ఛెత్రీ (1) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్ 38 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (2 వికెట్లు; 68 పరుగులు) ఆల్‌రౌండ్ ప్రదర్శన తో మెరిపించింది.
ఓపెనర్లు రాణించడంతో ఒకదశలో 7.5 ఓవర్లలో 74 పరుగులు చేసిన యూపీ వారియర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. అమేలియా విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హేలీ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), సివర్ బ్రంట్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ జెయింట్స్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment